స్వయంగా పరమ శివుడు చెప్పిన జన్మ రహస్యం! చరిత్ర అత్యంత ఘనం
అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది అయిన ‘శ్రీ జోగులాంబాదేవి’ శక్తి పీఠం శ్రీశైలానికి పశ్చిమ దిశగా .. మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలో అవతరించింది. ఇక్కడ సతీదేవి పైదంతాల వరుస పడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.  ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో స్నానం చేస్తే.. గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటంటే…
పూర్వం పుణ్యవతి అనే శివ భక్తురాలు కాశీ పట్టణంలో ఉండగా, విధివశాత్తు వితంతువుగా మారుతుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు ఆమె భర్తని, పరమ శివుని హృదయంలో చూపిస్తాడు. ఆ భక్తురాలు ఆనందంతో పొంగిపోయి శివుడిని, తనకు ఒక బిడ్డను అనుగ్రహించమని అడుగుతుంది. శివుడు అనుగ్రహించగా ఆమెకు బిడ్డ పుడతాడు కాని, లోకం దృష్టిలో ఆమె దోషిగా నిలబడుతుంది. ఆమె బిడ్డ కూడా ఎదిగే కొద్ది తన తండ్రి ఎవరో చెప్పమని అడగగా, అతని పుట్టుకకు శివుని అనుగ్రహం కారణమని చెబుతుంది. ఆ పిల్లవాడు కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ పరమ శివుని దర్శనం కోసం.అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అతని సందేహాన్ని తీరుస్తాడు. అతను కారణజన్ముడని, ఓ మహత్కార్యం నెరవేర్చాల్సింది ఉందని శివుడు  ఆదేశిస్తాడు.
దక్షిణ కాశీ అయినటువంటి అలంపురం శక్తి పీఠమనీ, వేదవతి – తుంగభద్ర నదుల సమీపంలో అక్కడి దేవతలకు దేవాలయాలను నిర్మించమని ఆ బాలుడికి చెబుతాడు. శివుడి అనుగ్రహంతో అలంపురం చేరుకొన్న ఆ బాలుడు, అక్కడ రాజు సహాయంతో దేవాలయం నిర్మించాడు. రాజు మొదట అడ్డుపడి శాపగ్రస్తుడై రాజ్యం పోగొట్టుకొని, ఆతరవాత మళ్ళి గుడి నిర్మాణంలో సాయంచేసి, పూర్వవైభవాన్ని పొందుతాడు.

No comments:

Post a Comment